బజార్ హత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో సంప్రదాయ దండారీ ఉత్సవాల శోభ సంతరించుకుంది. దీపావళి సందర్భంగా దండారీ ఉత్సవాలను గూడేల్లో ముందస్తుగా నిర్వహిస్తున్న చచ్చోయ్ నృత్యాలు చూపరులను అలరిస్తున్నాయి. చింతల సాంగ్వీ గ్రామంలో శనివారం రాత్రి చచ్చోయ్ నృత్యాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కాళ్లకు గజ్జెలు ఘల్లుఘల్లున మోగుతుండగా, సంప్రదాయ డోలు ‘పర్ర ’ వాయిద్యాల శబ్దాలకు అనుగుణంగా గిరిజనులు వేసిన అడుగులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ఆదివాసులు మాట్లాడుతూ తరతరాల నుంచి వస్తున్న ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తూ నేటికీ సజీవంగా కాపాడుకుంటున్నామని తెలిపారు.
